‘ఖాకీ’ మూవీ రివ్యూ

Khaki Movie Poster

మూవీ: ఖాకీ
రేటింగ్‌: 2.9/5
తారాగణం: కార్తీ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తదితరులు
సంగీతం: గిబ్రాన్
నిర్మాత: ప్రకాష్ బాబు ఎస్ ఆర్, ప్రభు ఎస్ ఆర్,
దర్శకత్వం: హెచ్ వినోత్‌

సినిమాల్లో పోలీసు కథలు అంటే అబ్బే ఏముంటాయి, అదే రొటీన్ డ్రామానే కదా అనుకుంటాం. దానికి తగ్గట్టే ఈ మధ్య వస్తున్న సినిమాలు బాగా మొనాటనీగా మారుతున్నాయి. అందుకే ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అయిన సింగం మూడో భాగం వచ్చే సరికి ఆ డ్రామా నచ్చక తిరస్కరించడం మొదలుపెట్టారు. అందుకే రాను రాను పోలీస్ మూవీ అంటే ఒక రొటీన్ వ్యవహారంలా మారిపోయింది. కానీ కార్తి ఖాకీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మాత్రం ఇదేదో కాస్త కొత్తగా ఉన్నట్టు ఉందే అనే ఫీలింగ్ కలిగింది. ఓపెనింగ్స్ కాస్త వీక్ గా ఉన్నా కంటెంట్ మీద నమ్మకంతో చిన్న సినిమాల భారీ పోటీ మధ్య దీన్ని విడుదల చేసారు. మరి ఖాకీ ఆ అంచనాలు నిలబెట్టుకుందో లేదో చూద్దాం….

దేశవ్యాప్తంగా దోపిడీలు, హత్యలు చేసే దుర్మార్గమైన దొంగల ముఠా ఒకటి పోలీస్ డిపార్టుమెంటుకి అతి పెద్ద సవాల్ గా మారుతుంది. క్లూ దొరక్కుండా తెగబడుతున్న ఈ టీంని పట్టుకోవడం కోసం డిజిపి ధీరజ్(కార్తి) రంగంలోకి దిగుతాడు. కాని అది అంత ఈజీగా ఉండదు. ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. చాలా చిక్కు ముళ్ళు ఉంటాయి. వాటిని దాటుకుని ధీరజ్ ఆ ముఠాను ఎలా పట్టుకుంటాడు అనేది ఖాకీ అసలు కథ

కార్తి మనకున్న బెస్ట్ యాక్టర్స్ లో ఒకడు. అందులో అనుమానం అక్కర్లేదు. పోలీస్ ఆఫీసర్ గా గతంలో విక్రమార్కుడు తమిళ రీమేక్ చేసాడు కాని అది మనకు చూసే అవకాశం లేకపోవడంతో ఇందులో కార్తి చాలా కొత్తగా ఫ్రెష్ గా కనిపిస్తాడు. తన ఈజ్ తో చాలా బాగా నటించాడు. అన్నయ్య సూర్య యముడు పాత్రకు ఏ మాత్రం పోలిక లేని ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ గా కార్తి తప్ప ఇంకెవరు దీనికి నప్పరు అన్నంత బాగా చేసాడు. సెకండ్ హాఫ్ లో మాత్రం కార్తి కేక పుట్టిస్తాడు. రకుల్ ప్రీత్ సింగ్ ధీరజ్ భార్య ప్రియగా కథలో కీలకం కాదు కాని అనవసరంగా ఇబ్బంది పెట్టింది కూడా లేదు. విలన్ అభిమన్యు సింగ్ తనకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే పాత్రను అవలీలగా చేసాడు. అరవ బ్యాచ్ బాగానే ఉన్నారు కాని మనకు పరిచయం ఉన్న మొహాలు తక్కువే. అనవసరంగా ఏ పాత్రా లేదు.

దర్శకుడు వినోత్ చాలా క్లియర్ విజన్ తో తాను ఏం చెప్పాలి అనుకున్నది చాలా పద్ధతిగా పక్కా ప్లానింగ్ తో స్క్రిప్ట్ రాసుకుని మరీ స్క్రీన్ మీద చూపించాడు. ఫస్ట్ హాఫ్ కొంత భాగం రొటీన్ గానే ఉంది అనే ఫీలింగ్ కలిగినా లవ్ ట్రాక్ కూడా సాధ్యమైనంత మేరకు బోర్ కొట్టకుండా రాసుకున్నాడు. ప్రీ ఇంటర్వెల్ నుంచి అమాంతం స్పీడ్ పెంచిన వినోత్ ఆ తర్వాత కామెంట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఇవ్వకుండా తన స్క్రీన్ ప్లే తో కట్టిపారేసాడు. కమర్షియల్ సూత్రాలకు లొంగిపోకుండా సీరియస్ గా చెప్పాల్సిన కథను అంటే టెంపోను మైంటైన్ చేస్తూ గ్రిప్పింగ్ నెరేషన్ తో ఆకట్టుకునే విధంగా తీయటంతో ఆడియన్స్ ఎక్కడా డిస్ కనెక్ట్ కారు.

ఇన్వెస్టిగేషన్ సీన్స్, ముఠా నేపధ్యం చూపించడం, యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్ని దేనికవే పోటీ పడుతూ వచ్చాయి. కాకపోతే ఎంటర్టైన్మెంట్ ఇతరత్రా రూపంలో లేకపోవడం చిన్న లోపం అనిపిస్తుంది కాని అదేమంత పట్టించుకునే విషయం కాదు. జీబ్రాన్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ లో సూపర్బ్ గా వచ్చింది. ఒక పాట తప్ప మిగిలినవి హీరొయిన్ ని వాడుకోవడం కోసం పెట్టినట్టు అనిపిస్తాయి కాబట్టి వాటి మీద అట్టే ఆసక్తి కలగదు. సత్యన్ సూర్యన్ కెమెరా వెన్నెముకగా నిలిచింది. చాలా రిస్కీ షాట్స్ ని సైతం మూడ్ మిస్ కాకుండా డిజైన్ చేసుకున్న ఫ్రేమ్స్ చాలా కొత్తగా అనిపిస్తాయి. చేజింగ్ ఎపిసోడ్స్ లో ఇతని పనితనం అత్యున్నతంగా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం అద్భుతంగా కంపోజ్ చేసారు. నిర్మాణంలో రాజీ పడినట్టు కనిపించదు.

ఖాకీ చాలా ఫ్రెష్ గా అనిపించే డీసెంట్ పోలీస్ థ్రిల్లర్ మూవీ. యాక్షన్ లవర్స్ మాత్రమే కాక చూస్తున్నంత సేపు సినిమా ఎంగేజ్ చేస్తూ ఉండాలి అని కోరుకునే ప్రేక్షకులను నిరాశపరచకుండా మెప్పించడంలో ఖాకీ టీం బాగా సక్సెస్ అయ్యింది. కమర్షియల్ గా రికార్డ్స్ క్రియేట్ చేయటం గురించి ఇప్పుడే కామెంట్ చేయలేం కాని కార్తి ‘నా పేరు శివ’ సినిమా తర్వాత దాన్ని మించే రేంజ్ లో ఉన్న సినిమా ఖాకీనే అని చెప్పొచ్చు. మిస్ అయినా పర్వాలేదు అనే మూవీ అయితే కాదు. సో ఖాకీ విషయంలో మీరు ఎలాంటి అంచనాలతో ఉన్నారో వాటికి మిస్ మ్యాచ్ కాకుండా నిలబడే రేంజ్ లో ఉన్న ఈ సినిమాని వీక్ ఎండ్ ఛాయస్ గా పెట్టుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here